రోమీయులకు

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16


చాప్టర్ 3

1 అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?
2 ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను.
3 కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు.
4 నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లునునీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును. అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.
5 మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడు చున్నాను;
6 అట్లనరాదు. అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును?
7 దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?
8 మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.
9 ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.
10 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు
11 గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు
12 అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.
13 వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది
14 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.
15 రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.
16 నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
17 శాంతిమార్గము వారెరుగరు.
18 వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
19 ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.
20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
22 అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.
23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
26 క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
27 కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే.
28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.
29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.
30 దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
31 విశ్వాసముద్వారా ధర్మశాస్త్ర మును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మ శాస్త్రమును స్థిరపరచుచున్నాము.