చాప్టర్ 12
1 శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
2 సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.
3 భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు
4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
5 నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.
6 భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును.
7 భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.
8 ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడ బడును కుటిలచిత్తుడు తృణీకరింపబడును.
9 ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటె దాసుడుగల అల్పుడు గొప్పవాడు.
10 నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.
11 తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృ ద్ధిగా కలుగును వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.
12 భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపే క్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును.
13 పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును.
14 ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును.
15 మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును.
16 మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
17 సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.
18 కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
20 కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.
21 నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు.
22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
23 వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.
24 శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును.
25 ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును.
26 నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.
27 సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.
28 నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు.