చాప్టర్ 89
1 యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.
2 కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను.
3 నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసి యున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను
4 తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.)
5 యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.
6 మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?
7 పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
8 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.
9 సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు.
10 చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి.
11 ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.
12 ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.
13 పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.
14 నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు.
15 శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు.
16 నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు.
17 వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.
18 మా కేడెము యెహోవావశము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు.
19 అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
21 నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును.
22 ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు.
23 అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను.
24 నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై యుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును.
25 నేను సముద్రముమీద అతని చేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను.
26 నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.
27 కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను.
28 నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.
29 శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.
30 అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల
31 వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల
32 నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.
33 కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను.
34 నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను.
35 అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు
36 చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు
37 నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.
38 ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు.
39 నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు.
40 అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు
41 త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.
42 అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచి యున్నావు
43 అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు
44 అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు
45 అతని ¸°వనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)
46 యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?
47 నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?
48 మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?
49 ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమా ణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ?
50 ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.
51 యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు.
52 యెహోవా నిత్యము స్తుతినొందును గాక ఆమేన్ ఆమేన్.