చాప్టర్ 20
1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన.... రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా
2 అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని
3 యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.
4 యెషయా నడిమి శాలలోనుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెల విచ్చెను.
5 నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.
6 ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.
7 పిమ్మట యెషయా అంజూరపుపండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపుమీద వేసినతరువాత అతడు బాగుపడెను.
8 యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదు ననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను
9 తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా?
10 అందుకు హిజ్కియా యిట్లనెనునీడ పదిమెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును.
11 ప్రవక్తయగు యెషయా యెహో వాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను.
12 ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడు నైన బెరోదక్బలదాను హిజ్కియా రోగియైయుండిన సంగతివిని, పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా
13 హిజ్కియా, దూతలు వచ్చినమాట విని వారిని లోపలికిరప్పించి, తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములుగల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను.
14 పమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియాయొద్దకు వచ్చిఆ మను ష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడనుండి వచ్చిరి? అని అడుగగా హిజ్కియాబబులోనను దూరదేశమునుండి వారువచ్చి యున్నారని చెప్పెను.
15 నీ యింటిలో వారు ఏమేమి చూచిరని అతడడుగగా హిజ్కియానా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి యున్నాననెను.
16 అంతట యెషయా హిజ్కియాతో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చుమాట వినుము
17 వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
18 మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు.
19 అందుకు హిజ్కియానీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలేగదా అని యెషయాతో అనెను.
20 హిజ్కియా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పిం చినదానిని గూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
21 హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.